10/5/15 5:29 PM

వేలాదిమంది పిల్లల ప్రాణాలు కాపాడిన జెపి, మందకృష్ణ

Jayaprakasha-Narayan-Manda-Krishna

Loksatta-Jayaprakasha-Narayan-Manda-Krishna

 

లోక్ సత్తా జెపి కి, మంద కృష్ణ కి ఏమిటి సంబంధం? వీళ్ళిద్దరూ కలిసి పిల్లల ప్రాణాలు కాపాడటం ఏమిటి అనుకుంటున్నారా? ఇది అక్షరాలా నిజం. ఒకే లక్ష్యం కోసం ఇద్దరూ వేరువేరుగా చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలితాలనిచ్చింది.  గాంధేయమార్గం లో, అహింసా పద్దతుల్లో కూడా అద్భుత విజయాలు సాధించవచ్చు అని ఈతరం లో విశ్వాసం నింపడం ఈ వ్యాసం లక్ష్యం.   వివరాల్లోకి వెళితే..

 

2004, ఆగస్ట్ కి ముందు:   గుండె జబ్బులతో బాధపడుతూ,ఆపరేషన్ చేయించుకోలేక వందలాది మంది పిల్లలు చనిపోతున్న సందర్భం అది. “మా పిల్లాడి గుండెకి చిల్లు ఉంది, ఆపరేషన్ కి సహాయం చేయండి” అని ఎంతోమంది తల్లిదండ్రులు టీవీ స్టూడియోల్లో లైవ్ లలో కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకునేవారు. ఇలాంటి పరిస్థితి చూసి చలించిన మంద క్రిష్ణ మాదిగ ఓ పెద్ద ఉద్యమానికి నాంది పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా గుండెజబ్బులతో బాధపడుతున్న వందలాది మంది పిల్లల్ని ఎంఆర్ పిఎస్ కార్యకర్తలు హైదరాబాద్ కి తరలించారు. పిల్లల ఆపరేషన్లకి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే కాని హైదరాబాద్ నుండి కదలం అంటూ ఆ పిల్లలు, తల్లిదండ్రులు మంద కృష్ణ నాయకత్వం లో భీష్మించుకుని కూర్చున్నారు. తీవ్ర ఉత్కంత రేకెత్తించిన ఈ సంఘటన తో ప్రభుత్వం దిగివచ్చింది. చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లపై ప్రభుత్వం ప్రకటన చేసింది. పిల్లలందరికీ ఉచితంగా ఆపరేషన్లు చేయించేందుకు అంగీకరించింది. ఆ తర్వాత వచ్చిన ఆరోగ్యశ్రీ పథకం లో చిన్నపిల్లల గుండె జబ్బుల చికిత్సను కూడా చేర్చింది. అప్పటినుండి వందలాది మంది పిల్లలు ఉచితంగా ఆపరేషన్లు చేయించుకోగలుగుతున్నారు. మందకృష్ణ పట్టుదల, ఉద్యమం వల్ల వేలాది ప్రాణాలు కాపాడబడ్డాయి.  అయితే ఈ సమస్య ఇక్కడితో అయిపోలేదు.

 

 

చిన్నపిల్లలకి గుండె సమస్య ఎందుకొస్తుంది అంటే.. గర్భవతులు కొంతమందికి  రుబెల్లా అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు పెద్దగా బయటకి కన్పించవు. కొద్దిగా జ్వరం, జలుబు, కళ్ళు ఎర్రగా రావడం, గొంతునొప్పి వస్తాయి. చాలా మంది పారాసెట్మాల్ లాంటి టాబ్లెట్స్ వేసుకుంటారు, తగ్గిపోతుంది. కాని ఆ జబ్బు కడుపులో బిడ్డ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, ఆ బిడ్డ పెద్దయ్యాక గుండె జబ్బుకి కారణం అవుతుంది. అప్పుడిక ఆపరేషన్ తప్ప వేరే మార్గం ఉండదు. ఈ సమస్యని బాగా అర్థం చేసుకున్న లోక్ సత్తా  జెపి, గర్భిణీ స్త్రీలకి రుబెల్లా వ్యాధి రాకుండా చేసే MMR ( మీజిల్స్, మంప్స్, రుబెల్లా) వాక్సిన్ ను అందించాలని 2004 నుండే  ప్రభుత్వాలకి సూచిస్తున్నారు. పిల్లలకి ఈ వాక్సిన్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో కొన్ని తీవ్రమైన జబ్బులు రాకుండా కాపాడవచ్చు అని ఆయన ప్రభుత్వాలకి సూచించారు.

 

2004 లో సోనియాగాంధి అధ్యక్షతన ఏర్పాటైన జాతీయ సలహామండలి లో సభ్యుడిగా జెపి ఆరోగ్య రంగం లో తీసుకురావాల్సిన సంస్కరణలపై ప్రభుత్వానికి సూచనలు చేసారు. జెపి సలహాలతోనే జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ రూపుదిద్దుకుంది. ఈ పథకం ద్వారా ప్రజారోగ్యం పై ప్రభుత్వాలు 2014 వరకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. ఈ పథకం అమలులో భాగంగా ప్రభుత్వం ఇచ్చే వాక్సిన్స్(టీకా) లిస్టు లో MMR వాక్సిన్ ను చేర్చమని జెపి సూచించారు. ప్రభుత్వాలు ఏవేవో కుంటిసాకులు చెబుతూ దీన్ని వాయిదా వేస్తూ వచ్చాయి. ఆరోగ్యరంగంలో  తీసుకురావలసిన సంస్కరణలపై డిసెంబర్11,2004 లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులు మాంటెక్ సింగ్ అహ్లువాలియా కు జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన ప్రెజెంటేషన్ లో కూడా ఈ వాక్సిన్ గురించి చెప్పారు.పెద్ద పెద్ద విషయాలు ఆలోచించే ఢిల్లీ పెద్దలకి ఈ విషయం చాలా చిన్నదిగా అనిపించి పక్కన పడేసారు. జెపి మాత్రం MMR వాక్సిన్ గురించి నిరంతరం ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. 2006 లో లోక్ సత్తా పార్టీ స్థాపించాక జెపి మాట్లాడిన ప్రతి సభలోనూ MMR వాక్సిన్ గురించి ప్రస్తావించారు. 2006 లో ఆరోగ్య శ్రీ టీవీ9 లో జరిగిన డిబేట్ లోనూ అప్పటి చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి ని ఇదే విషయం పై నిలదీశారు.( ఈ వీడియో యు ట్యూబ్ లో ఉంది). ఇక్కడ నేను(ఈ వ్యాసకర్త) చూసిన ఓ సంఘటన చెప్పాలి.

 

2009, నేను హెచ్ఎంటీవీ కోసం కమాన్ ఇండియా ప్రోగ్రాం చేస్తున్నాను. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ కార్యక్రమానికి ప్రెజెంటర్ గా చేసారు. హెల్త్ గురించిన ఎపిసోడ్ లో జెపి ఇంటర్వ్యూ తీసుకోవాలని మేము అన్నపూర్ణా స్టూడియోలో షూటింగ్ ప్లాన్ చేసాము. వేరే టాపిక్ పై నాగార్జున  ఇంటర్వ్యూ తీసుకుని, అక్కడే జెపి ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాము. అప్పుడు జెపి, రాజమౌళి తో MMR వాక్సిన్ గురించి చెప్పారు.  రాజమౌళి “కేవలం 3 కోట్ల తో ఇన్ని వేలమంది పిల్లల ప్రాణాలు కాపాడే అవకాశం  ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చేయడంలేదు?” అని జెపి ని అడిగారు.దానికి జెపి, “రోగం వచ్చాక ఆపరేషన్  చేయిస్తే జనాలు ఆహా అని ఓట్లు వేస్తారు, అదే అసలు జబ్బులే రాకుండా చేస్తే జనానికి నొప్పి తెలియదు, నాయకులకి ఓట్లు రావు, అందుకే రోగ నివారణ కన్నా ఆరోగ్యశ్రీ లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు” అని చెప్పారు. ఇలా వారిద్దరి మధ్య సాగిన సంభాషణకి నేను ప్రత్యక్షసాక్షిని. 2014 దాకా కూడా ఇదే విషయం పై ప్రభుత్వాలని జెపి ప్రశ్నిస్తూ వచ్చారు.2014 ఎన్నికలకి ముందు జెపి నరేంద్రమోది ని అహ్మదాబాద్ లో కలిసారు. అప్పుడు కూడా జెపి దేశం లో తీసుకురావాల్సిన మార్పుల గురించి ప్రస్తావిస్తూ MMR వాక్సిన్ గురించి వివరించారట. ఎట్టకేలకు జెపి ప్రయత్నం ఫలించింది.

 

2014 జూలై లో నరేంద్ర మోది నాయకత్వం లోని భారత ప్రభుత్వం  రుబెల్లా వాక్సిన్ ను ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే టీకాల జాబితాలో చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇక భవిష్యత్తులో మన భారత దేశం లో పుట్టిన పిల్లలెవరికీ రుబెల్లా వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదమే ఉండదు. కొన్ని వేల, లక్షల మంది పిల్లలకి రుబెల్లా వ్యాధి నుండి విముక్తి లభించబోతోంది. మనదేశం లో ఇంత పెద్ద మార్పు నిశ్శబ్దంగా వచ్చింది. బస్సులని తగలబెట్టకుండా, జనజీవనానికి ఆటంకం కలిగించకుండా శాంతియుతపద్ధతుల్లో నిరంతరం కృషి చేయడం ద్వారా ఎన్నో మార్పులు సాధించవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

 

Tags : ap newsarogya sribollywood gossipsbreaking newschildren heart problemscinema newsdaily newsgalleryhealthJayaprakash Narayanjp-and-manda-krishna-saved-lives-of-childrenlatest breaking newslatest newslatest telugu newsLOK SATTALOK SATTA JPmanda krishnamanda krishna madigamovie ratingsMovie ReviewMovie Reviewsmovie trailers.news headlinespolitical newspregnant womenpublic healthrubella deceaserubella vaccinetelangana newsTelugu movie newstelugu political newstoday newstollywood gossipstollywood latest news

Also read

Use Facebook to Comment on this PostMenu